
అంతే కదా..
మనం వేసే ఆ అద్భత నూలు పోగే ‘చంద్ర హారం’ …..
పుడమి మీద నెలబాలుడు పుష్కల మైన వెలుగులు నింపేందుకు డిసెంబర్ 4న దిగుతున్నాడు.
రెండు రోజుల క్రితమే అమావాస్య చీకటి లాంటి గర్భ సంచిలో ఉండి బయట పడేదెప్పుడా అని ఆశతో ఎదురు చూశాడు.
సముద్రుడు ‘వారసత్వం’ సరే… ‘వంశోద్ధారకుడు’ రాబోతున్నాడని సంతోషిస్తున్నాడు.
——-
‘పెద్దక్కయ్య’ ‘లక్షమ్మ’ రాబోతున్న ‘రక్త సంబంధం’ తలచుకుంటూ పొంగి పోతోంది. ‘నన్న తమ్మ’ అని కన్నడంలో మురిసి పోతోంది.
‘తల్లిదండ్రులు’ ‘చంద్ర వంక’ చూసి అమ్మాయ్ ..వీడికి మన ‘సొంత వూరు’ ‘పల్లెటూరు’ లో ‘చుట్టరికాలు’ వెతికి ‘మేనకోడలు’ ని ఎత్తుకొచ్చి ‘పెళ్లి చేసి చూడు’ అని తనకే పెద్ద బాధ్యత అప్పగించే ఆ ‘రేపు నాదే’ కదా అని గర్వ పడుతోంది. ‘మంచి మనసుకు మంచి రోజులు’ అంటే ఇదే కాబోలు అనుకుంది.
తప్పకుండా ‘కనక తార’నిచ్చి ‘పెళ్లి నాటి ప్రమాణాలు’ చేయించి ‘పెళ్లి సందడి’ చూడాల్సిందే అని ఊహిస్తోంది. ఈ నెల‘బాలరాజు’కట్టే తాళియే ఆ ‘పుణ్యవతి’ మెడలో ‘రత్నమాల’. ఆమె ‘స్త్రీ జన్మ’ సార్ధకం కావాలి. ఆమె వేసే ‘పూలమాల’ తో ఇద్దరి ‘జీవితబంధం’ పరిమళించాలి. ‘గుడిగంటలు’ మోగాలి. ‘చిరంజీవులు’ మురిసిపోవాలి.
‘కన్యాశుల్కం’ ఉహూ( …పాత మాట! ’వదినగారి గాజులు’ అమ్మి పెళ్లి చెయ్యాల్సిన పనే లేదు. తండ్రిని మించిన ‘షావుకారు’ లేడు.
పిల్లని ఎత్తుకొచ్చిన ‘బందిపోటు’ అని పాపం ఈ ‘గోవుల గోపన్న’ని నిందిస్తారేమో. ‘సి ఐ డి’ ని నియమిస్తారేమో. ‘నిర్దోషి’ ‘నిర్దోషి’ అని తెలుగులో రెట్టించి అరవాలి. అరవంలో ‘నిరపరాది’ అనాలి. పిల్ల హృదయాన్ని ‘అభిమానం’ తో దొంగిలించాడని నచ్చ చెప్పాలి.
లావుగా ఉన్న మరదలు తనది ‘భువన సుందరి కథ’. ఇదీ ‘జరిగిన కథ’ అని ‘రహస్యం’ గా చెప్పేస్తుంటే.. కాదు…’గుండమ్మకథ’ అని భరతం పట్టించాలి.
వీడు బాల భరతుడు అని చెప్పవే అంటుంది తల్లి ‘శకుంతల’.
——–
చంద్రుడు దిగాడు. క్యారు మనలేదు. స ప స అన్నాడు. ఏమిటీ నాగేంద్రజాలం అనుకున్నారంతా. ఏ మాంత్రికుడో జై ‘పాతాళ భైరవి’ అని, ఏ ‘మర్మయోగి’ యో ‘మాయ బజార్’ లోకి ‘కీలు గుర్రం’ తో దిగి హార్స్ పవర్ ఇవ్వడం లేదు కదా అని కలయజూశారు.
చంద్రుడు బోసినోటితో చుట్టూ చూశాడు.
తల్లి గర్భంలో ఉండగా విన్న’సతీ అనసూయ’,’సతీ సుకన్య’, ‘సతీ సావిత్రి’ లాగ కొందరు కనిపించారు. ‘మోహినీ రుక్మాంగద’ లాగ కొందరున్నారు. ‘శ్రీకృష్ణ కుచేల’ వంటి ‘ఆప్తమిత్రులు’ కొందరనిపించారు.
‘పరమానందయ్య శిష్యుల కథ’ లో గురువుగారిలాగ, ‘లవకుశ’ సోదరద్వయాన్ని హత్తుకున్న ‘వాల్మీకి’ లాగ ఒక్కరంటే ఒక్కరు స్వర్గసీమ లో తనకి అందిస్తున్న ‘ లే యెన్నెల సిరునవ్వుల’ పోత(న) గా కనిపించారు. వెన్నెల తోనే ‘బ్రతుకు తెరువు’ అనుకో, వెన్నెల పంచడాన్నిమించిన ‘పరోపకారం’ లేదని తెలుసుకో అని ఆయన దీవిస్తూ మాయమయ్యారు.
అబ్బాయిలోని వెలుగు చూస్తున్న వారు ‘మెరుపు వీరుడు’ అని తెలుగులో , ‘వీర కేసరి’ అని కన్నడంలో ఆశ్చర్యపోతున్నారు.
‘వీరపూజ’ ఫలితం అన్నారు కొందరు. ‘సత్యనారాయణ మహాత్మ్యం’ అన్నారు మరి కొందరు.
అబ్బాయి ‘పట్టిందల్లా బంగారం’ అవుతుంది అని జోస్యం పలికారు కొందరు.
అబ్బాయి చేయి ‘పట్టుకుంటే లక్ష’ ముత్యాలు దొర్లుతాయి అని హాస్యం పండించారు కొందరు,
అవి తమకి మామూలే కదా అని సముద్రుడు నవ్వుకున్నాడు.
జాగర్తండోయ్….అబ్బాయిని ‘శభాష్ రాజా’ అనేలా చేస్తారో, ‘రంగేళీ రాజా’ గా చూస్తారో ..అని కొందరు వ్యంగ్య బాణం సంధించారు. వారి వ్యంగ్యానికి మండి పడ్డవారు ఆనంద సమయాన్ని ‘చెరపకురా చెడేవు’ అని వారించారు.
అబ్బాయి వెన్నెల పొందే ప్రతి ఇల్లు ‘శాంతి నివాసం’ కావాలి. అబ్బాయి చంద్రుడే కాదు శ్రీ రామ చంద్రుడు. ఆ వెన్నెల దీపం వెలిగే ప్రతి ఇల్లు ఒక ‘రామాలయం’ కావాలి , అబ్బాయి కాలు మోపే ‘మన దేశం’ ‘రామరాజ్యం’ అయిపోవాలి- అన్నాడు సముద్రుడు.
అబ్బాయి కళ్ళ నుంచి ‘జయం మనదే’, ‘విజయం మనదే’ అన్నట్టు ఆనందబాష్పాలు రాలాయి. సముద్రుడికి అవి ఉప్పగా తోచలేదు. ‘తులసి’ తీర్థం లాగ గొప్పగా తోచాయి.
———
చంద్రుడు పదహారు కళలు నేర్చుకుని తమాషాగా ప్రతి ఏడూ పన్నెండు సార్లు సినీవాలి (అమావాస్య) లో కను మరుగైపోతూ మర్నాడు కనిపిస్తూ నెల నెలా వెలుగులు పంచాడు.
సినీవాలి అంటే అమావాస్యే. ఆనాడు చంద్రుడు కనిపించడు.
‘వినాయక చవితి’ నాడు చంద్ర దర్శనం నిషేధం. కాని అప్పుడే చంద్రుడు ఇంకా ఎంతో అందంగా కనిపిస్తాడు.
చంద్రశేఖరుడు తన అర్దాంగితో ‘పార్వతీ కళ్యాణం’ గురించి చెబుతూ ముచ్చటిస్తుంటే శివుడి సిగలో అలంకారమై కూర్చున్న చంద్రుడు వరమడిగాడు.
దినకరా శుభకరా ..దీనాపాల…తిమిర సంహార …అని సూర్యుణ్ణి నిత్యం ఉదయాన్నే స్తుతించు. ఆయన ప్రతిఫలం ఆశించడు. ఆ వెలుగు నీ పైన ప్రతిఫలించి నువ్వు నిత్యం శోభిస్తావు. సినీవాలి లో సగభాగం ‘సినీ’ అన్నది నీ సీమ అయి, దానికి చిత్రసీమ అనే చిత్రమైన పేరొచ్చి నీ యశస్సు కలకాలం నిలుచు గాక….ఇదే నా ఆశీస్సు…. ఆన్నాడు శివుడు.
—————–
సూర్యుడు స్వరకర్త , చంద్రుడు గాయకుడు …వీరే తన రెండు కళ్ళు కాగా ‘వేంకటేశ్వరుడు’ అనే తెలుగు వారి ఇలవేల్పు భూమ్మీద వెలిశాడు.
ఘంటసాల వేంకటేశ్వరుడు అనే తెలుగువారి గళ వేల్పు సూర్యచంద్రుల ప్రతిరూపంగా ఎంచి తెలుగువారు……… గాయకుడిగా ఆయన పంచిన వెన్నెల గానాన్ని, స్వరకర్తగా ఆయన అందించిన స్వర తేజస్సుని ఇంకా అపురూపంగానే చూసుకుంటున్నారు.
–డా. తాతిరాజు వేణు గోపాల్ , 04 డిసెంబర్ 2013
[ ముందొచ్చిన మాటలకి వెనక మాట:
ఇందులో వచ్చినవి సినిమా పేర్లని మీకు తెలుసు. అయితే అవి- ఘంటసాల మాస్టారు గారి సంగీత దర్శకత్వంలో వచ్చినవి.
గాయకుడిగా ఘంటసాల వారి తొలి చిత్రం ‘స్వర్గసీమ’ (1944). ఓగిరాల రామచంద్రరావు, బాలాంత్రపు రజనీకాంత రావు, ఉప్పలదడియం నాగేశ్వరం అనే చిత్తూరు నాగయ్య ఈ చిత్రానికి సంగీత దర్శకులు.
సంగీత దర్శకుడిగా ఘంటసాల వారి తొలి చిత్రం ‘రత్నమాల’ (1947). అయితే ఈ చిత్ర సౌధానికి సి.ఆర్.సుబ్బురామన్, రజనీ, సాలూరు రాజేశ్వరరావు అనే మరో మూడు స్వర స్తంభాలు ఉండేవి.
‘బాలరాజు’ (1948) రెండవ చిత్రం. ఈ బాలరాజ సంగీత దర్బారులో గాలి పెంచలనరసింహారావు, అతని అసిస్టెంట్ సుబ్బురామన్ లు ప్రముఖులు. అక్కినేని పాడిన, ఘంటసాల పాడిన ‘చెలియా కనరావా’ పాట స్వరకర్త ఘంటసాల వారే.
‘కీలు గుర్రం’ (1949) తో ఘంటసాల వారికున్న హార్స్ పవర్ ప్రపంచానికి తెలిసి పోయింది. ఘంటసాల వారు విదేశీ కచేరీలకి వెళ్ళినా సంప్రదాయ దుస్తులతో ‘మనదేశం’ (1949) నిధిలా, ప్రతినిధిలా కనిపించేవారు.
ఘంటసాల వారు ఎత్తిన మరో అవతారం- సినిమా నిర్మాత. ‘పరోపకారం’(1953), ‘సొంత ఊరు’ (1956), ‘భక్త రఘునాథ్’ (1960) –ఇవి ఆయన నిర్మించి ఇహ చాలు బాబోయ్ అనుకున్న మూడు చిత్రాలు.
గాయకుడిగా, స్వర కర్తగా రెండు అద్భుత రూపాలు ధరించిన ఘంటసాల వారికి ‘రెండు’ మెండుగా పని చేసింది. స్వర కర్తగా ఆయనికి ‘లక్ష్మమ్మ (1950)’ కదిలి వస్తే పోటీగా మరొకరికి ‘లక్ష్మమ్మ కథ’ లాగ వచ్చింది. ఒక ‘నిర్దోషి’ (1951) ఒకనాటి ప్రజా హృదయంలో నిలబడితే మరో ‘నిర్దోషి’(1967) మరో తరం మధ్యకొచ్చాడు. ఒకరు ‘జయం మనదే’ (1956) అంటే మరొకరు ‘విజయం మనదే’ (1970) అనిపించారు. ఒకరు ‘శభాష్ రాముడు’(1959) అంటే మరొకరు ‘టైగర్ రాముడు’(1962) అన్నారు. ఒకరు ‘శభాష్ రాజా’(1961) అంటే మరొకరు ‘రంగేళీ రాజా’ (1971) అన్నారు. ఒకరు ‘వాలి సుగ్రీవ’ (1950) అన్నదమ్ముల్ని చూపిస్తే ఇంకొకరు ‘లవకుశ’(1963) కవలలు ఉన్నారన్నారు.
అన్నట్టు ఘంటసాల వారిది ‘రెండు కుటుంబాల కథ’(1970) అంటే అది అతిశయోక్తి కాదు- సినిమా కుటుంబ పెద్దగా ఈయన సినిమానస మనీషి. కుటుంబ పెద్దగా ఈయన మనసున్న మనిషి.
విజయా సంస్థ వారి తొలి చిత్రం ‘షావుకారు’ (1950)కి ఈయనే స్వర కర్త. ‘విజయా’ నందంతో ఈయన పెద్దకొడుక్కి పెట్టిన పేరు- విజయ కుమార్.
స్వర కర్తగా ఈయనకి తొలి చిత్రం ‘రత్నమాల’(1947). ఈయన రెండవ పుత్రుడి పేరు- రత్న కుమార్.
‘శ్యామలా దండకం’ (మహాకవి కాళిదాసు, 1960) తో ఈయన పూర్తిగా తెలుగు వారి గళవేల్పు అయిపోయారు. ఈయన కూతురు పేరు – శ్యామల.
సముద్రాల రాఘవాచార్యులు ఈయనికి పితృ తుల్యులు. ఘంటసాల వారిని చిత్రసీమకి పరిచయం చేసినది వీరే. సముద్రాల రామానుజాచార్యులు సోదర సమానుడు. జూనియర్ సముద్రాల వారికి పేరు తెచ్చిన చిత్రం ‘శాంతి నివాసం’(1960). ‘శ్రీ రఘురాం జయరఘురాం’ పాటలో కళ్యాణ గుణ, శుభ గుణ అనే సుగుణాల రామ, గృహం శాంతి నివాసం అనే ధీమా రెండూ ఉన్నాయి. కనుక ఘంటసాల వారు తన కడపటి కూతుళ్ళ పేర్లు – సుగుణ, శాంతి అని అనుకోవడంలో ఆత్మీయతానుబంధం ఉంది.
–డా. తాతిరాజు వేణుగోపాల్, 04 డిసెంబర్2013]
{కనులు చూసినా పాటే–
‘హరి ఓం…పాండురంగ పాండురంగ’ (భక్త తుకారం) అని ప్రభాత వేళ మేలు కొల్పడానికి , పాండురంగ మహాత్మ్యం తెలిసి ‘హే కృష్ణా ముకుందా మురారి’ అని చిరు భాగవతం అందాలు చూపడానికి అవసరమయ్యే గళం ఘంటసాల వారిదే. ఒక కంట అక్కినేని, ఇంకొక కంట నందమూరి కనిపించే రూపం ఘంటసాల వారిది.
‘గంగా యమునా తరంగాలతో ….ఎంత చక్కనిది మన దేశం’ అని ఏకాకిగా మురిసిపోవాలన్నా, ‘ఉడుతా ఉడుతా హుత్ ..’ అని పిల్లలతో మమేకమై పోవాలన్నా కావాల్సిన గళం ఘంటసాల వారిదే. ఒక భుజాన కృష్ణ, ఇంకో భుజాన శోభన్ లను ఎక్కించి తిప్పిన తండ్రి ఘంటసాల.
కనిపిస్తున్నది ఎన్టీ ఆర్ అయినా అతని పెదవి కదలదు, ఎందుకంటే – ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి’ (దేవత) గురించి అడిగితే, ‘ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’అని ఘంటసాల వారు నేపధ్యంలో వర్ణించి చెబుతారని తెలుసు కనుక.
కనిపిస్తున్నది ఎఎన్నార్ అయినా అతనికీ పెదవి కదలదు, ఎందుకంటే- ‘త్యాగశీలవమ్మ మహిళా ,,అనురాగశీలవమ్మా’ (మంచి కుటుంబం) అని ఘంటసాల వారే నేపధ్యంలో అసలు కథ విడమర్చి చెబుతారని తెలుసు కనుక.
కంచు కంఠం తనదైనా జగ్గయ్య గారికి తెలుసు అది ‘ఆకాశవాణి’ అని, కొండగాలి తిరగాలి, గుండె ఊసు లాడాలి అంటే ఘంటసాల అనే కంఠశాల కి మాత్రమే సాధ్యమని.
కొండలైనా కరిగిపోవు కూర్చుని తింటే ..అని హెచ్చరించాలని నట సార్వభౌమ ఎస్వీఆర్ కెంత ఉబలాటమో. తమ జీవిత నౌక సుఖంగా సాగాలంటే ధనము విలువ తెలుసు కొనుట మానవ ధర్మం అని గళ సరంగు ఘంటసాల నోట చెప్పించి చూడడమే మంచి పని అని ఆయనికి తెలుసు.
కనులు మూసినా పాటే–
నాలుగు సినిమా రత్నాలు….నాలుగు లలిత గీతికా ముత్యాలు
నవోదయం శుభోదయం…అరుణ పతాకం…..నవ యువలోకం…ప్రబోధ గీతం అని మహిళ మేల్కొల్పుతుంటే సమాన పథంలో నడిచేందుకు సిద్ధపడిన యువకుడి గొంతులో ఘంటసాల వారిని కనుగొనవచ్చు (బాలరాజు)
కళ్ళ నిన్ను జూచినానే పిల్లా …ఒళ్ళు ఝల్లు మన్నదే పిల్లా …కళ్ళు మూయగానే నీ కలలే …అని తన ప్రేమ వాక్కు వినిపించే పోలీసు మావయ్య ఎక్కడో ఒక చోటైనా తారస పడక పోడు అని ఘంటసాల వారి నమ్మకం (మనదేశం).
తధిం ధిం త తననాం…..అని ఘంటసాల తిల్లానా పాడడం ఎంత అరుదైనదీ! ‘వెంకటేశ్వరా’ అని పాటలో సంబోధిస్తే ..అవును కదూ ఈయన పేరూ వెంకటేశ్వరే అని సంతోషిస్తాం (లక్ష్మమ్మ).
‘నేనే విరజాజి నైతే ..నీవే ఎలమావి వైతే ...’ (లక్ష్మమ్మ) అనే హిందుస్తానీ ముజ్రాని వింటే అంత అందంగా స్వర పరచిన ఘంటసాల వారికి బడే గులాం అలీ ఖాన్ అంటే ఎందుకంత ఇష్టమో అర్ధమౌతుంది.
ఇవన్నీ సినిమా రత్నాలు …మరి ఆ లలిత గీతికా ముత్యాల మాటేమిటి?
విశాలాంధ్ర నలుమూలల ..జనుల కనుల వెలుగులో …ఏం కనిపిస్తున్నాయో ఒక గళ దృశ్యం మన ముందు కదలాలంటే ఎందుకు వేదంలా గోదావరి ప్రవహించాలి?
తేనెల నొలికించు తెలగాణ….రతనాల రాయల సీమ….సర్కారు భూమి……తెలుగమ్మ ఒడిలో సేద తీరిన తమ్ములు ….అనే అద్భుత భావన కి ఏది అచ్చమైన గళ వేదిక?
నవ్యాంధ్ర రాష్ట్ర జ్యోతి వెలగాలన్నా…పతాక ఎగరాలన్నా….గతించిన వైతాళికుల పైన ఎందుకు దృష్టి సారించాలి?
నవమాసములు భోజనము నీర మెరుగక పయనించు బాటసారి, బోసి నోటి నవ్వుల మోహనుండు, బొట వ్రేలు నోటిలో పెట్టుకుని, ఎదురుగా కనిపించే మూడు వేళ్ళు ముల్లోకాలు గా ఎంచే యోగి ఎవరు?
ఇన్ని ప్రశ్నలకి సానుకూల సమాధానం ఘంటసాల వారి స్వకీయ స్వర భూషిత లలిత గీతాల్లో లభిస్తుంది.
రత్నాలకి, ముత్యాలకి దారి చూపేది సముద్రుడే. వారి పుత్ర రత్నం, దరహాస ముత్యం ఆ గాన చంద్రుడికి మనం సమర్పించుకునే నూలుపోగు …చెప్పండి…..విలువైనదా కాదా?
–డా. తాతిరాజు వేణుగోపాల్ , 02 డిసెంబర్ 2013

Leave a comment